Mouthwash | న్యూఢిల్లీ: నోటి దుర్వాసన నుంచి బయటపడేందుకు మౌత్ వాష్‌ను వాడటం నేడు పరిపాటిగా మారింది. అయితే మార్కెట్లో ఏది పడితే.. దాన్ని కొని వాడితే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. వీటికి బదులు తినే సోడా, ఉప్పును నీటిలో కలిపి పుక్కిలించినట్టయితే నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడొచ్చని పరిశోధకులు సూచించారు. పరిశోధన వివరాల్ని తెలుపుతూ ‘డెంటల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియా’ వార్తా కథనం వెలువరించింది. దీని ప్రకారం, ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న మౌత్ వాష్ ఉత్పత్తుల్లో ‘ఇథనాల్’, అనుబంధ ఉత్పత్తుల్ని(ఎసిటాల్డీహైడ్) వాడుతున్నారని తేలింది. నోటిలో సున్నితమైన చిగుర్లపైన ఇది పేరుకుపోయి కొంత కాలం తర్వాత క్యాన్సర్‌కు దారితీస్తుందని పరిశోధకులు గుర్తించారు.