న్యూఢిల్లీ: క్యాన్సర్.. ఈ పేరు వింటేనే అందరికీ ఒంట్లో వణుకు పుడుతుంది. దాదాపు ప్రతి కుటుంబానికీ క్యాన్సర్‌తో ఏదో ఒక సంబంధం ఉంటున్నది. ధైర్యంగా పోరాడిన ఒక ఆప్తుడు.. చికిత్స తీసుకుంటున్న ఒక సహోద్యోగి, లేదా నిశ్శబ్దంగా పోరాడుతున్న స్నేహితుడి తల్లిదండ్రులు. దేశంలో ప్రస్తుతం క్యాన్సర్ సర్వసాధారణంగా మారింది. ‘ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జేఏఎంఏ)లో ప్రచురితమైన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’ (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం ప్రకారం.. 2024లో దేశంలో 15.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 8,74,404 మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య దేశ ప్రజల ఆరోగ్య సమస్యలకు అద్దంపడుతున్నది. ‘క్యాన్సర్ ఇన్సిడెన్స్ అండ్ మోర్టాలిటీ అక్రాస్ 43 క్యాన్సర్ రిజిస్ట్రీస్ ఇన్ ఇండియా’ పేరుతో ప్రచురించిన ఈ అధ్యయనం.. ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే 2045 నాటికి దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య 24.6 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
ఐసీఎంఆర్ఈ అధ్యయనం ప్రకారం లింగం ఆధారంగా క్యాన్సర్ ధోరణులలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. పురుషుల్లో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ సర్వసాధారణం. నిరుడు కేవలం నోటి క్యాన్సర్ ఒక్కటే 1,13,000 కొత్త కేసులకు కారణమైంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నాయి. 2024లో రొమ్ము క్యాన్సర్ కేసులు 2,38,000 పైనే. భారతీయ మహిళలను ఎక్కువగా వేధిస్తున్నది కూడా ఇదే. ఈ అధ్యయనం ప్రకారం దేశంలో జీవితకాల క్యాన్సర్ రిస్క్ 11 శాతం కాగా, మిజోరాం వంటి ప్రాంతాల్లో ఈ ముప్పు చాలా ఎక్కువగా ఉంది.
పురుషుల్లో 21.1 శాతం, స్త్రీలలో 18.9 శాతంగా నమోదైంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. 30-40 సంవత్సరాల వయసు వారిలోనూ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నిర్ధారణ అవుతున్నాయి. గతంలో వయసు పైబడిన మహిళల వ్యాధిగా పరిగణించే రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు యువతులనూ వేధిస్తోంది. పొగాకు నమలడం, ధూమపానం, మద్యం తాగడం వంటి జీవనశైలి అలవాట్లు నోటి క్యాన్సర్‌కు కారణమవుతుండగా, మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కదలికలేని జీవనశైలి యువతుల్లో రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. పురుషుల్లో అత్యధిక క్యాన్సర్ రేటు ఢిల్లీలో నమోదైంది. అయితే ఐజ్వాల్, శ్రీనగర్‌లలో నిర్దిష్ట రకాల క్యాన్సర్ రేట్ దేశంలోనే అత్యధికంగా ఉంది.
క్యాన్సర్‌ను నివారించేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే మొదటి రక్షణ మార్గమని ఈ అధ్యయనం పునరుద్ఘాటించింది. పొగాకు, ధూమపానం మానేయడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని వైద్యులు చెప్తున్నారు. చిన్నపాటి నడక, మెట్లు ఎక్కడం కూడా చాలా మార్పును తీసుకొస్తుందని అంటున్నారు. అలాగే, వేయించిన, ప్యాకేజ్డ్ ఆహారాలను తగ్గించి, తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. మహిళలు రొమ్ము, గర్భాశయ పరీక్షలు, పురుషులు నోటి, ఊపిరితిత్తుల పరీక్షలు చేయించుకోవాలి. పొగాకు, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, కాలుష్యం వంటి ప్రమాదాలను నియంత్రించగలిగితే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ క్యాన్సర్ కేసులను నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు.