PresVu Eye Drops | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ ఇటీవల ఆవిష్కరించిన ‘ప్రెస్వు’ ఐ డ్రాప్స్‌కు డీసీజీఐ అనుమతి రద్దు చేసింది. ఈ ఐ డ్రాప్స్‌కు డీసీజీఐ ఆగస్టులో అనుమతి ఇచ్చింది. ప్రెస్బియోపియాతో బాధపడుతున్న వారు తమ ఐ డ్రాప్స్ వాడితే కళ్లద్దాల అవసరం తగ్గుతుందని ఈ కంపెనీ ప్రకటించింది. ‘రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించేందుకు భారత్‌లో తయారు చేసిన మొదటి ఐ డ్రాప్’ అని వెల్లడించింది.
ఈ ప్రకటనపై వివరణ ఇవ్వాలని డీసీజీఐ సెప్టెంబర్ 4న కంపెనీని ఆదేశించింది. ప్రెస్బియోపియా చికిత్సకు భారత్‌లో ఇప్పటివరకు ఏ ఐ డ్రాప్స్‌కు అనుమతి లేనందున ఈ ప్రకటన చేసినట్టు కంపెనీ వివరణ ఇచ్చింది. అయితే, కళ్లద్దాల అవసరాన్ని తగ్గించేందుకు ఈ ఐ డ్రాప్స్ పని చేస్తాయని చెప్పుకోవడానికి అనుమతి లేదని పేర్కొన్న డీసీజీఐ, దాని అనుమతిని రద్దు చేసింది. దీనిని కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ సీఈఓ నిఖిల్ కే మసూర్కర్ తెలిపారు.