చెన్నై: వాట్సాప్ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ దేశీయంగా అభివృద్ధి చేసిన ఒక నూతన మెసేజింగ్ యాప్ వచ్చేసింది. దీని పేరు ‘అరైట్టె’. తమిళంలో అరైట్టె అంటే కబుర్లు అని అర్థం. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ సంస్థ జోహో దీనిని అభివృద్ధి చేసింది. ఇందులో టెక్స్ మెసేజ్‌లు, వాయిస్, వీడియో కాల్స్, మీడియా షేరింగ్, స్టోరీలు, చానల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, వాయిస్, వీడియో కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతను అందిస్తున్నది.
వాట్సాప్ వంటి గ్లోబల్ యాప్‌ల మాదిరిగా కాకుండా అరైట్టె వినియోగదారుల వ్యక్తిగత డాటాను వాణిజ్య ప్రకటనలకు వినియోగించబోమని జోహో హామీ ఇస్తున్నది. డిజిటల్ భద్రత, గోప్యత పట్ల ఆందోళనలో ఉన్న వినియోగదారులను ఇది బలంగా ఆకర్షిస్తున్నది. ఈ యాప్ మొబైల్స్‌తోపాటు డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ టీవీల్లోనూ ఉపయోగించుకోవచ్చు. గతంలో హైక్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు వాట్సాప్‌ను సవాల్ చేయాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. అయితే, అరైట్టెకి ప్రభుత్వ మద్దతు ఉండటం, మేడిన్ ఇండియా గుర్తింపుతోపాటు డాటా గోప్యత కారణంగా ఇది వాట్సాప్‌కు పోటీ ఇచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.