CAG | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): స్వదేశ్ దర్శన్ స్కీమ్‌లో భాగంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అయోధ్య డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలను గుర్తించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తెలిపింది. 2015 జనవరి నుంచి 2022 మార్చి మధ్య నిర్వహించిన ఆడిట్లో రూ. 19.73 కోట్ల మేర అవకతవకలు గుర్తించినట్టు పేర్కొంది.
ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ఓ నివేదికలో వెల్లడించింది. ప్రాజెక్టు పనుల నాణ్యతా హామీ, లైసెన్సులు, పన్నులకు సంబంధించిన పలు అంశాల్లో ఈ అక్రమాలను గుర్తించినట్టు నివేదిక వివరించింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్‌మాల హైవే ప్రాజెక్టుల్లోనూ ఉల్లంఘనలను గుర్తించినట్టు కాగ్ తెలిపింది. టెండర్లలో నిబంధనల ఉల్లంఘన, ప్రాజెక్టుల అప్పగింతల్లో అవకతవకలు జరిగినట్టు పేర్కొన్నది.