న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. వారికి 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను ఇవ్వాలని బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. రైల్వే ఉద్యోగుల అద్భుతమైన సేవలకు గుర్తింపుగా బోనస్ ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. బోనస్ కోసం మొత్తం రూ.1,866 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. రైల్వేలోని 10,91,146 మంది లబ్ధి పొందుతారన్నారు.
కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) మూడో దశకు క్యాబినెట్ ఆమోదం లభించింది. దీంతో దేశవ్యాప్తంగా కొత్తగా 5,000 పోస్ట్‌గ్రాడ్యుయేట్ సీట్లు, 5,023 అండర్గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) సీట్లు వస్తాయి. మరోవైపు, నౌకా నిర్మాణం, సముద్ర పర్యావరణ వ్యవస్థలకు నూతన జవసత్తాలను అందించడం కోసం రూ.69,725 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.