న్యూఢిల్లీ : మోదీ ప్రభుత్వ మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ త్వరలో జరిగేలా కనిపిస్తున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ చేపట్టవచ్చని అధికార పక్షంనుంచి సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ అనేది నితిన్ నబిన్ నేతృత్వంలోని కొత్త బీజేపీ బృందం ప్రకటనతోపాటే సమాంతరంగా జరుగుతుంది. బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే జాబితాను ఖరారు చేసినట్టు సమాచారం. పార్టీ పదవుల్లో ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
ముఖ్యంగా నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ డిజిటల్ మార్కింగ్ విధానంలో అక్రమాలకు సంబంధించిన వరుస వివాదాల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొన్నది. ఇద్దరు కేంద్ర మంత్రులు పంకజ్ చౌదరి, హర్ష మల్హోత్రాలకు ఇప్పటికే వరుసగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పార్టీ విభాగాలకు నేతృత్వం వహించే బాధ్యతలను అప్పగించారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ బిట్టు ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ద్వారా తిరిగి నామినేట్ చేయలేదు. ఎగువ సభలో వారి పదవీకాలం జూన్ 21తో ముగిసింది. కురియన్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేయగా బిట్టు మాత్రం మంత్రిగా కొనసాగుతున్నారు.
వచ్చే ఏడాది మూడు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ర్టాల నుంచి మరికొంతమంది ప్రతినిధులకు మోదీ మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లోని రెబల్ గ్రూపుల ప్రతినిధులు కొందరికి మంత్రి పదవులు దక్కవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల్లో ఒకరు లేదా ఇద్దరు మంత్రిమండలిలో చోటు దక్కించుకోవచ్చని తెలిసింది. అయితే టీఎంసీ, శివసేన(యూబీటీ) వర్గాల నుంచి సభ్యులను చేర్చుకొనే ఏ నిర్ణయమైనా లోక్‌సభ స్పీకర్ ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు కేంద్రమంత్రులు హర్దీప్ పురి, బీఎల్ వర్మ రాజ్యసభ పదవీకాలం నవంబర్‌లో ముగియనున్నది.
ఎగువ సభకు వారిని తిరిగి నామినేట్ చేయడంపై అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గవర్నర్లు థావర్‌చంద్ గెహ్లాట్(కర్ణాటక), మంగుభాయ్ పటేల్(మధ్యప్రదేశ్), లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్‌సింగ్(ఉత్తరాఖండ్) రాబోయే నెలల్లో తమ పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారు. గెహ్లాట్, పటేల్ జూలైలో, సింగ్ సెప్టెంబర్‌లో పదవీకాలం ముగించనున్నారు. ప్రభుత్వం నుంచి నిష్క్రమించే కొంతమంది మంత్రులకు గవర్నర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నది. జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు, జూలై నెలలో ఈ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశమున్నట్టు సమాచారం. ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ మార్పుల తేదీని ఖరారు చేసే అవకాశం ఉన్నది.