న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 44 గిరిజన ప్రాబల్య జిల్లాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు రెండు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర క్యాబినెట్ బుధవారం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కింద ఆయా జిల్లాల్లో రూ 33,822 కోట్లతో రోడ్లు, మొబైల్ టవర్లతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడతారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఈ నిధుల్లో రూ 22,978 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లోని 7287 గ్రామాల్లో టెలికాం టవర్ల నిర్మాణంతో టెలికాం కనెక్టివిటీ కల్పించేందుకూ క్యాబినెట్ ఆమోదించింది. ఈ గ్రామాల్లో టెలికాం టవర్ల నిర్మాణంతో పాటు టెలికం సర్వీసులు అందుబాటులోకి రావడం ద్వారా లక్షలాది మంది గ్రామీణులు లబ్ధి పొందనున్నారు.