న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశవ్యాప్తంగా 13 రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీలే సత్తా చాటాయి. మొత్తం 46 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని కూటమి పార్టీలు 26 స్థానాల్లో గెలిచాయి. యూపీ, బీహార్, రాజస్థాన్‌లలో బీజేపీ, దాని మిత్రపక్షాలు, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. యూపీలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు పోటీ చేయగా, ఏడింటిలో విజయం సాధించాయి.
రెండింటిని సమాజ్‌వాదీ పార్టీ దక్కించుకుంది. రాజస్థాన్‌లో ఏడింటిలో పోటీ చేసిన బీజేపీ ఐదింటిని దక్కించుకోగా, కాంగ్రెస్, భారత్ ఆదివాసీ పార్టీ తలో సీటులో విజయం సాధించాయి. బీహార్‌లో నాలుగు స్థానాల్లోనూ ఎన్డీఏ క్లీన్‌స్వీప్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఆరు, ఆమ్ ఆద్మీ పార్టీ మూడు, సమాజ్‌వాదీ పార్టీ రెండు, రాజస్థాన్‌లో బీఏపీ ఒకటి, కేరళలో ఎల్డీఎఫ్ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇవి కాక, సిక్కింలోని రెండు స్థానాలను సిక్కిం క్రాంతికార్ మోర్చా గెల్చుకుంది. వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గింది.