అహ్మదాబాద్: ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. తాగే నీటిలో విషం కలిపి పదేళ్ల కుమారుడికి ఇచ్చాడు. అది తాగిన ఆ బాలుడి ఆరోగ్యం విషమించింది. ఇది చూసి భయాందోళన చెందిన తండ్రి సూసైడ్ ప్లాన్ విరమించుకున్నాడు. ఆ ఇంటి నుంచి పారిపోయాడు. (Man Kills Son By Poisoning Water) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. బాపూనగర్ ప్రాంతంలో నివసించే 47 ఏళ్ల కల్పేష్ గోహెల్ తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 4న భార్య ఇంట్లో లేని సమయంలో పదేళ్ల కుమారుడు ఓం, 15 ఏళ్ల కుమార్తె జియాకు విషం ఇచ్చి చంపాలని తండ్రి ప్లాన్ వేశాడు. తొలుత వాంతులు కాకుండా ఉండేందుకు వారికి మెడిసిన్ ఇచ్చాడు. ఆ తర్వాత విషం కలిపిన నీటిని కుమారుడికి ఇచ్చి తాగించాడు.
కాగా, ఆ నీటిని తాగిన వెంటనే పదేళ్ల కుమారుడికి వాంతులయ్యాయి. బాలుడి శరీరం రంగు మారడంతోపాటు అతడి ఆరోగ్యం క్షీణించింది. ఇది చూసి భయాందోళన చెందిన కల్పేష్ గోహెల్ తన మొబైల్ ఫోన్ ఇంట్లో వదిలేసి పారిపోయాడు. తమ్ముడి పరిస్థితి గమనించిన అతడి కుమార్తె వెంటనే తన బంధువుతోపాటు అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. వారు ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తండ్రి విషం ఇచ్చి చంపిన కుమారుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కల్పేష్ గోహెల్ ఆచూకీని గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.