న్యూఢిల్లీ, జూన్ 11 : న్యాయపరమైన క్రియాశీలత భారత్లో కొనసాగడమేగాక ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా రూపాంతరం చెందరాదని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ విఫలమైనట్లు తేలిన పక్షంలో న్యాయవ్యవస్థ జోక్యం తప్పదని సీజేఐ అన్నారు.
మంగళవారం ఆక్స్ఫర్డ్ యూనియన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీజేఐ గవాయ్ ప్రసంగిస్తూ న్యాయపరమైన క్రియాశీలత భారత్లో ఉండి తీరుతుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా మారకూడదని అన్నారు. కొన్ని సందర్భాలలో న్యాయవ్యవస్థ తన పరిధులు దాటి ప్రవేశించకూడని ప్రాంతంలోకి ప్రవేశించవలసి వస్తుందని, అరుదైన కేసులలో మాత్రమే న్యాయపరమైన సమీక్ష అధికారాన్ని ఉపయోగించాలని నొక్కి చెప్పారు.