న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానానికి కొన్ని మీటర్ల దూరంలో పార్క్ చేసిన ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఇవాళ మధ్యాహ్నం 3వ నెంబర్ టర్మినల్ లో ఈ ఘటన జరిగింది. ఎస్ఏటీఎస్ ఎయిర్ పోర్టు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ బస్సును ఆపరేట్ చేస్తున్నది. 32వ బేలో నిలిచిన ఆ బస్సులో ప్రమాదం సమయంలో ఎవరూ లేరు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. ఏఆర్ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం బస్సు మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. కొన్ని క్షణాల్లోనే మంటల్ని ఆర్పేశామన్నారు. ప్రస్తుతం ఆపరేషన్స్ అన్నీ నార్మల్గా సాగుతున్నట్లు చెప్పారు. ఈ ఘటన పట్ల ఎస్ఏటీఎస్ దర్యాప్తు చేపడుతున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎటువంటి ప్రయాణికుడు కానీ లగేజీ కానీ లేనట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో మూడు టర్మినల్స్,నాలుగు రన్వేలు ఉన్నాయి.