లక్నో: ఒక వాహనం మంటల్లో కాలిపోయింది. (Vehicle Burnt) అందులో ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని హత్య చేసి వాహనంలో ఉంచి నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి టయోటా ఫార్చ్యూనర్ మంటల్లో కాలిపోయింది. గమనించిన కొందరు వ్యక్తులు అందులో ఉన్న ఒక వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే విఫలం కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వాహనంలో కాలి మరణించిన వ్యక్తిని ఘజియాబాద్‌కు చెందిన సంజయ్ యాదవ్‌గా గుర్తించారు. అతడు స్నేహితులతో కారులో వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఆభరణాల విషయంలో గొడవ జరిగి ఉంటుందని, దీంతో స్నేహితులు అతడ్ని హత్య చేసి ఆ కారులో మృతదేహాన్ని ఉంచి నిప్పంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.