లక్నో: ప్రస్తుతం బుల్డోజర్లు విశ్రాంతి తీసుకుంటున్నాయని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అవి అక్రమ ఆస్తుల పనిపడతాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. శుక్రవారం మెయిన్పురిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. యోగి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నేరస్తుల ఆస్తులపై బుల్డోజర్లను నడపదంటూ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘మార్చి 10 (ఎన్నికల ఫలితాలు) తర్వాత బుల్డోజర్లను ఉపయోగిస్తాం. గత నాలుగున్నరేండ్లుగా దాక్కుని, ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన వారందరిపై బుల్డోజర్లను ఉపయోగిస్తాం’ అని వ్యాఖ్యానించారు. బుల్డోజర్ల విషయంలో ఎస్పీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. యంత్రాలైన వాటికి కూడా విశాంత్రి కావాలని, అందుకే రిపేర్ల కోసం పంపామన్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఉపయోగిస్తామన్నారు.
నేరస్తులకు చెందిన ఆక్రమ ఆస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేసేందుకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని సీఎం యోగి ఎన్నికల ప్రచారం సందర్భంగా పదే పదే ప్రస్తావిస్తున్నారు. అలాగే నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు విధ్వంసం కలిగించే, ధ్వంసం చేసే వారి నుంచి ఆ నష్టాన్ని రికవరీ చేస్తున్నామని, గతంలో ఇలాంటి చర్యలు లేవంటూ తమ ప్రభుత్వం గురించి ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.