లక్నో: బుల్డోజర్ ఇప్పుడు గ్యారేజ్‌లో ఉంటుందని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. ఇకపై పేదల ఇళ్లను కూల్చివేయలేరంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నవంబర్ 20న ఉప ఎన్నికలు జరుగనున్న కాన్పూర్‌లోని సిసామావు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు తెలిసి ఉండాలి. ఈ ప్రభుత్వానికి ప్రతీకగా మారిన బుల్డోజర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు’ అని అన్నారు.
కాగా, ఇళ్లు కూలగొట్టే వారి నుంచి ఏమి ఆశించాలి? అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ‘ఇప్పుడు వారి బుల్డోజర్ గ్యారేజ్‌లో ఉంటుంది. పేదల ఇల్లు ధ్వంసం చేయలేరు’ అని అన్నారు. సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్న కవి ప్రదీప్ పంక్తులను కూడా అఖిలేష్ యాదవ్ ప్రస్తావించారు. ‘ప్రతి ఒక్కరూ ఇంటి కోసం కలలు కంటారు. ఆ ఇంటి కల నెరవేర్చుకోవాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు’ అని అన్నారు. సీఎం యోగి ప్రభుత్వంపై ఇంతకంటే బలమైన విమర్శలు ఉండబోవని మండిపడ్డారు.