Budget | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి పలు సబ్సిడీ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించింది. గత ఏడాదితో పోలిస్తే ఆహారం, ఎరువుల సబ్సిడీని 8 శాతం మేర తగ్గించింది. 2024-25లో ఎరువుల సబ్సిడీని కేవలం రూ.1.64 లక్షల కోట్లకు పరిమితం చేసింది. 2023-24లో కేటాయించిన రూ.1.89 లక్షల కోట్లతో పోల్చితే.. ఈ సారి 13.2 శాతం తగ్గించారు. దీని వల్ల రైతులకు రావాల్సిన యూరియా సబ్సిడీపై, ఇతర ఎరువులపై, పోషకాల ఆధారిత సబ్సిడీపై (డీఏపీ, ఎంవోపీ) పెద్ద దెబ్బ పడనున్నది.
అంతర్జాతీయంగా ఎరువుల ధరలు తగ్గుముఖం పడుతున్నా నిధుల్లో కేంద్రం కోతలు విధించింది. దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55-60 శాతం వరకు ఉంటున్నది. రైతులకు సబ్సిడీ యూరియా 45 కిలోల బ్యాగ్ రూ.242లకు లభిస్తున్నది. దీనికి పన్నులు, వేప పూత చార్జీలు అదనం. ఇదే బ్యాగ్ బహిరంగ మార్కెట్లో అసలు ధర సుమారుగా రూ.2200 అవుతుంది. ఇక ఆహారం, పెట్రోలియం ఉత్పత్తులపైనా సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులకూ కేంద్రం కోత పెట్టింది. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాదితో పోల్చితే 3.33 శాతం తక్కువ. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీ కోసం గత ఏడాది రూ.12,240 కోట్లు కేటాయించగా, ఈ సారి కేటాయింపుల్లో 2.6 శాతం కోత విధించింది. వంటగ్యాస్ సబ్సిడీని పూర్తిస్థాయిలో ఎత్తేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది.