లక్నో: తాను క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకోవడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి (Mayawati) స్పష్టం చేశారు. ‘కులవాద మీడియా’ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, గౌరవనీయులైన కాన్షీరామ్ జీ వంటి బహుజనుల ఆశయాలను నిర్వీర్యం చేసే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి తన చివరి శ్వాస వరకు బీఎస్పీ ఆత్మగౌరవం, ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం కావాలన్నదే తన నిర్ణయమని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాగా, తాను లేనప్పుడు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ వారసుడిగా పార్టీ ప్రతిపాదించిందని 68 ఏళ్ల మాయావతి తెలిపారు. అయితే అప్పటి నుంచి ఇలాంటి తప్పుడు వార్తలను కుల మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె అన్నారు.
మరోవైపు గతంలో కూడా తనను రాష్ట్రపతి చేస్తారన్న పుకార్లు వ్యాపించాయని మాయావతి గుర్తు చేశారు.
అయితే గౌరవనీయులైన కాన్షీరామ్ కూడా ఇలాంటి ప్రతిపాదనను తిరస్కరించారని తెలిపారు. ‘రాష్ట్రపతి కావడమంటే క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకోవడమేనని ఆయన అన్నారు. ఆయన శిష్యురాలిగా ఆ పదవిని నేను ఎలా అంగీకరిస్తాను?’ అని మాయావతి ప్రశ్నించారు.