న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగుల రెండో విడత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు రంగం సిద్ధమవుతున్నది. సంస్థలోని 35 శాతం సిబ్బందిని తగ్గించే లక్ష్యంతో చేపట్టే రెండో విడత వీఆర్ఎస్కు టెలి కమ్యూనికేషన్స్ శాఖ ఆర్థిక శాఖను అనుమతి కోరింది. ఈ మేరకు 15 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 18 వేల నుంచి 19 వేల మంది ఉద్యోగులను సంస్థ నుంచి ఇంటికి పంపనుంది.
వీఆర్ఎస్ కారణంగా భవిష్యత్తులో సంస్థపై ఆర్థిక భారం తగ్గడమే కాక, లాభదాయకత పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ తన ఆదాయంలో 38 శాతమైన రూ.7,500 కోట్లను సిబ్బంది జీతాలకు వెచ్చిస్తున్నది. దీంతో కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేసేందుకు ఈ ఖర్చును రూ.5,000 కోట్లకు తగ్గించాలని ప్రణాళిక వేస్తున్నది. రెండో విడత వీఆర్ఎస్కు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే దానిని కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపాలని ఆ శాఖ యోచిస్తున్నది. కాగా, ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఇంకా 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాలేదు.