చండీఘడ్: పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద సుమారు 16 డ్రోన్లను(Drones Seized) బోర్డర్ సెక్యూర్టీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి ఆ డ్రోన్లను సీజ్ చేశారు. దీనికి తోడు 16 కిలోల మత్తుపదార్ధాలను కూడా బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఆ స్మగ్లింగ్ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు. నవంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు 16 డ్రోన్లను కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు.
గతంలో ఓ వారంలో అత్యధికంగా 10 డ్రోన్లను సీజ్ చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగినట్లు బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. అమృత్సర్, తార్న్ తరన్, గురుదాస్పూర్ సెక్టార్లలో ఆ డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది 216 డ్రోన్లను రికవరీ చేశారు.
అయితే 2023లో మొత్తం 107 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ భూభాగం నుంచి ఎగురుతున్న ఆ డ్రోన్లతో నార్కోటిక్ పదార్ధాలు, ఆయుధాలు, నకిలీ కరెన్సీ సరఫరా చేస్తున్నారు.