హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లు, జమ్ముకశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ)బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బిల్లులపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో నామా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సంబంధించి దేశంలో జనగణనను సత్వరం చేపట్టాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్ 29న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు.
అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్దనే పెండింగ్‌లో ఉన్నదని నామా పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ బిల్లులను ఆమోదించడం సమర్థనీయమే అని పేర్కొన్న ఆయన.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సంబంధించి అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153 కు పెంచాల్సి ఉండగా, ఇంతవరకు అది జరుగలేదని, ఈ అంశాన్ని త్వరితగతిన తేల్చాలని కోరారు.
తెలంగాణాలో బీసీలుగా ఉన్న వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని నామా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వడ్డెరలు కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలుగా కొనసాగుతున్న అంశాన్ని నామా గుర్తుచేశారు. వారి సామాజిక, ఆర్థిక అంశాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు.