న్యూఢిల్లీ, జూలై 27 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో గురువారం కూడా బీఆర్ఎస్ సభ్యులు నిరసన గళం వినిపించారు. రాజ్యసభలో చర్చించాల్సిన అంశాలపై చైర్మన్ జగదీప్ధన్కడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేసింది. గతకొన్ని రోజులుగా తాము ఇస్తున్న వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించకుండా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బీఏసీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు చెప్పారు.
కేంద్రం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్తోపాటు, ప్రతిపక్షపార్టీలకు చెందిన సభ్యులంతా నల్లచొక్కాలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. పార్లమెంట్ ఆవరణలో నిరసనల్లో పాల్గొన్నారు. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు,ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఖండించారు.