లక్నో: ప్రభుత్వ పథకం ద్వారా డబ్బులు పొందేందుకు సొంత సోదరిని ఆమె సోదరుడు పెండ్లి చేసుకున్నాడు. అంతా విస్తూ పోయే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. ఈ నెల 11న తుండ్ల బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రాంగణంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. ఈ సందర్భంగా 51 జంటలు పెండ్లి చేసుకున్నాయి. ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం కింద యూపీ సాంఘిక సంక్షేమ శాఖ ఈ వివాహాలు నిర్వహించింది. ఈ పథకం కింద పెండ్లి చేసుకున్న జంటకు ప్రభుత్వం రూ.35,000 నగదుతోపాటు గృహోపకరణాలను బహుమతిగా ఇస్తుంది. ఇందులో రూ.20,000 నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.
కాగా, ఈ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బులు పొందేందుకు తుండ్ల పరిధిలోని గ్రామానికి చెందిన సోదరుడు, సోదరి ఈ సామూహిక వివాహాల సందర్భంగా పెండ్లి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది. సొంత చెల్లిని అన్న పెండ్లి చేసుకున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించడంతో ఈ సంగతి అధికారులకు తెలిసింది. దీంతో సోదరుడిపై కేసు నమోదు చేశారు. పెండ్లి సందర్భంగా వారికి ఇచ్చిన గృహాపకరణాలను అధికారులు వెనక్కి తీసుకున్నారు.