హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ జేబుదొంగ అని, జీఎస్టీ రూపంలో ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శుక్రవారం సీపీఎం దేశ రక్షణ రణభేరి నిర్వహించింది.
ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ.. ఏటా పేద ప్రజల నుంచి రూ.2 లక్షల కోట్లను జీఎస్టీ రూపంలో కేంద్రం వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. ఏటేటా అదానీ, అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయని, ప్రపంచ కుబేరుల్లోనే అదానీ రెండో స్థానానికి చేరుకున్నారని చెప్పారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్.. బ్రిటిష్ పాలకుల మాదిరిగా విభజించి పాలించు రీతిలో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. మోదీ ఆంధ్రాకు ఒరగబెట్టింది ఏమి లేదని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మొండి చేయి చూపారని మండిపడ్డారు.