బిజ్నోర్: పెండ్లి వేడుకలో వరుడి చెప్పులు దాచి పెట్టే కార్యక్రమం వధూవరుల కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… పెండ్లి వేడుకల సంప్రదాయాల్లో భాగంగా వరుడు ముహమ్మద్ షబీర్ చెప్పులను వధువు సోదరి దాచి పెట్టి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వరుడు ఆమెకు రూ.5 వేలు ఇచ్చి తన చెప్పులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఆ తర్వాత వధువు బంధువులు కొందరు ఈ విషయమై వరుడిని పరిహాసం చేస్తూ అతడిని బిచ్చగాడని పిలిచారు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వాదన జరిగింది. వధువు కుటుంబ సభ్యులు వరుడిని ఒక గదిలో బంధించి కర్రలతో కొట్టారని అతడి బంధువులు ఆరోపించారు.
అయితే వరుడి కుటుంబం వారికి కానుకగా లభించిన బంగారం నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేయడంతోనే గొడవ జరిగిందని వధువు వర్గం వారు ఆరోపించారు. వధువు కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని వరుడి కుటుంబం తమతో అన్నదని వధువు సోదరుడు ఆరోపించారు. గొడవలపై ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాలు రాజీకి వచ్చాయి.