చండీగఢ్: పెళ్లికి ముందు వధువు మాయమైంది. (Bride Missing) పెళ్లి ఏర్పాట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో కుటుంబం, బంధువులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్న వరుడు షాక్ అయ్యాడు. వధువు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుసుకున్న అతడు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంజాబ్‌లోని మోగాలో ఈ సంఘటన జరిగింది. జలంధర్‌లోని మాండియాలీ గ్రామానికి చెందిన 24 ఏళ్ల దీపక్ కుమార్ దుబాయ్‌లో పని చేస్తున్నాడు. మోగాకు చెందిన మన్‌ప్రీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి పరిచయమైంది. సోషల్ మీడియా ద్వారా మూడేళ్లుగా మాట్లాడుకున్న వీరిద్దరూ ఎప్పుడూ కూడా కలుసుకోలేదు. అయితే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.
కాగా, దీపక్ కుమార్ నెల రోజుల కిందట దుబాయ్ నుంచి సొంత గ్రామానికి తిరిగి వచ్చాడు. మన్‌ప్రీత్ కౌర్, ఆమె కుటుంబంతో అతడి తండ్రి ప్రేమ్ చంద్ మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశాడు. దీంతో పెళ్లి కోసం తన కుటుంబం, బంధువులు, స్నేహితులైన సుమారు 150 మంది పరివారంతో ఊరేగింపుగా దీపక్ కుమార్ శుక్రవారం మోగాకు చేరుకున్నాడు. అయితే వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు తమ వారిని పంపిస్తామని చెప్పిన వధువు, ఆమె కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నాయి.
Dubai Returned Groom
మరోవైపు మోగాకు చేరుకున్న పెళ్లి బృందం పలు గంటలు ఎదురు చూసింది. వధువు కుటుంబం పేర్కొన్న పెళ్లి వేదిక ‘రోజ్ గార్డెన్ ప్యాలెస్’ గురించి స్థానికులను ఆరా తీశారు. మోగాలో ఆ పేరుతో ఎలాంటి ఫంక్షన్ హాల్ లేదని తెలుసుకుని షాక్ అయ్యారు. దీంతో దీపక్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పెళ్లి ఖర్చుల కోసం రూ.50,000 కూడా మన్‌ప్రీత్ కౌర్‌కు పంపినట్లు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.