ప్రయాగ్రాజ్, మే 16: వరకట్న నిరోధక చట్టం సెక్షన్ 3(2) ప్రకారం, వధూవరులు పెండ్లి సమయంలో వచ్చే బహుమతుల జాబితాను సిద్ధం చేసుకుని, తమ దగ్గర ఉంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. విభేదాలు తలెత్తితే, వరకట్నంపై తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నది.
పెండ్లి సమయంలో వరుడు లేదా వధువుకు ఇచ్చే నగదు, బహుమతులు కట్నం కింద కాకుండా, అవి బహుమతిగా ఇచ్చినవని నిర్ధారించడానికే చట్టంలో ఈ నిబంధన ఉందని తెలిపింది. వరకట్న నిరోధక చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం కూడా నేరమని, దీనికి 50 వేల కనీస జరిమానాతో పాటు ఐదేండ్లకు తక్కువ కాకుండా శిక్ష పడుతుందని కోర్టు పేర్కొన్నది.