బెంగళూరు, మే 2: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గత రెండు సంవత్సరాల్లో మూడుసార్లు అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఏఈడీ)ని పెంచడం పట్ల బ్రూవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) శుక్రవారం మండిపడింది. తాజాగా బీర్పై 10 శాతం ఏఈడీని పెంచడాన్ని ఆక్షేపించింది. గత రెండేళ్లలో ఏఈడీ 205 శాతానికి పెరిగిందని ఆరోపించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం పెంచిన పన్నును ఉపసంహరించుకోవాలని, ఇలా తరచూ పన్నులు పెంచే విధానాన్ని మానుకోవాలని కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్య కారణంగా మద్యం పరిశ్రమకు తీవ్ర నష్టం కలగడమే కాక, రాష్ట్ర పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.
రెండేళ్ల కన్నా తక్కువ వ్యవధిలో ప్రభుత్వం నాలుగుసార్లు (మూడుసార్లు ఏఈడీ, ఒకసారి ఎక్సైజ్ డ్యూటీ) పన్ను పెంచిందని, ఇది తాము ఎక్కడా చూడలేదని బీఏఐ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి అన్నారు. దీని కారణంగా బీర్ ధర రూ.160 నుంచి రూ.200కు చేరుకుందని విమర్శించారు. 2023-24లో బీర్ పరిశ్రమ వృద్ధి 46 శాతం ఉండగా, 2024-25కు దారుణంగా కేవలం ఒక శాతానికి పడిపోయిందని అన్నారు. తాజా అదనపు పన్ను బాదుడు కారణంగా ఇది మరింత దిగజారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పన్ను ఆదాయానికి బీరు అసమానంగా అధికంగా దోహదపడుతున్నదన్నారు. మద్యం పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి 16 శాతం పన్ను ఆదాయం లభిస్తున్నదని, ఐదేండ్ల క్రితం ఇది 11 శాతం మాత్రమే ఉండేదన్నారు. ఎక్కడా లేని విధంగా బీఏఐ సభ్యులు కర్ణాటకలో ఈ పరిశ్రమపై 3,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 11 బ్రూవరీల ద్వారా 7 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే రోజురోజుకు అమ్మకాలు దిగజారుతున్నాయని, ఇది వాణిజ్యపరంగా వ్యాపారులకు ఎంతమాత్రం అనుకూలం కాదని ఆయన తెలిపారు.