న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కరోనా టెస్టులను వేగంగా, సులభంగా నిర్వహించేందుకు సింగపూర్‌లోని నన్యాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ‘బ్రీతలైజర్’ అనే ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు. దీనిపై గాలిని ఊదడం ద్వారానే వైరస్‌ను గుర్తించవచ్చు. అంతే కాకుండా ఇది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల కంటే వేగంగా, కచ్చితత్వంతో ఫలితాన్నిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రీతలైజర్ ఉపరితలంపై ప్రత్యేక సెన్సర్లు ఉంటాయి. వీటిపై గాలిని 5 సెకండ్ల పాటు ఊదాలి. గాలితో సెన్సర్లలో రసాయన ప్రక్రియ జరిగి వైరస్‌ను గుర్తిస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయి. సభలు, సమావేశాలు, వివాహాల సమయంలో కరోనా పరీక్షలకు ఇది చాలా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.