Jagadish Shettar-Congress | కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి బీజేపీలో చేరిన కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జగదీశ్ షెట్టర్ ‘విశ్వాస ఉల్లంఘన (Breach of trust)’కు పాల్పడ్డారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. గతేడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పట్ల బీజేపీ అవమానకరంగా వ్యవహరించడంతోపాటు పోటీ చేయడానికి టికెట్ నిరాకరిస్తే జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి జగదీశ్ షెట్టర్‌కు గౌరవం ఇచ్చామని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పేర్కొన్నారు. బీజేపీలో చేరికపై జగదీష్ షెట్టర్ తన మనసాక్షిని ప్రశ్నించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. బీజేపీతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధంతోపాటు చాలా మంది తన హితులు తనను బీజేపీలో చేరమని కోరారని జగదీశ్ షెట్టర్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులతో సంప్రదించిన తర్వాత జగదీశ్ షెట్టర్ బీజేపీలో చేరారు.
బీజేపీలో జగదీశ్ షెట్టర్ చేరికపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘నాతో జగదీశ్ షెట్టర్ మాట్లాడారు. తనను పార్టీ (బీజేపీ)లోకి తిరిగి రమ్మని అంటున్నారని, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారని నాతో జగదీశ్ షెట్టర్ చెప్పారు. నిన్న ఉదయం కూడా నేను ఆయనతో మాట్లాడాను. ఆయన నాతో మాట్లాడుతూ బీజేపీలోకి వెళ్లను, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మరో జీవితం ఇచ్చిందని చెప్పారు. ఆయన చెప్పిన మాటలే గుర్తుకు తెచ్చుకోవాలి. కానీ నాకు అందిన సమాచారం ప్రకారం జగదీశ్ షెట్టర్ బీజేపీలో చేరారు’ అని తెలిపారు.
బెంగళూరులో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ సీనియర్ నేతగా జగదీశ్ షెట్టర్‌ను కాంగ్రెస్ పార్టీ గౌరవంగా చూసుకుందని చెప్పారు. ‘ బీజేపీ మంచిది కాదు అని ఆయన (షెట్టర్) చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేశారు. సీనియర్ నాయకుడిగా ఆయనను కాంగ్రెస్ పార్టీ విశ్వసించింది. కానీ ఇప్పుడు మీరు (మీడియా) చెబుతున్నట్లు నమ్మకం, విశ్వాసం ఉల్లంఘన జరిగింది. నాకు అందిన సమాచారం ప్రకారం శాసన మండలి సభ్యత్వానికి, శాసనమండలి చైర్మన్ పదవికి ఆయన రాజీనామా లేఖ పంపారు. ఆయన ఎందుకు వెళ్లారో నాకు తెలియదు. (బీజేపీ) నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందా తెలియదు’ అని అన్నారు.
జాతీయ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరానని చెబుతున్న జగదీశ్ షెట్టర్‌కు.. `నాడు అసెంబ్లీ ఎన్నికల్లో (బీజేపీ) టికెట్ ఇవ్వనప్పుడు జాతీయ ప్రయోజనాలు గుర్తుకు రాలేదా..? ఆయన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి, జాతీయ ప్రయోజనాల గురించి తెలియదా?` అని డీకే శివకుమార్ ప్రశ్నించారు.