న్యూఢిల్లీ, జూలై 21: మరికొద్ది సెకన్లలో టేకాఫ్ అవుతుందనగా ఎయిరిండియా ఫ్లైట్ పైలట్స్ దానికి బ్రేకులు వేసి వెంటనే నిలిపివేశారు. సోమవారం ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 160 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బయల్దేరిన ఫ్లైట్ నంబర్ ఏఐ-2403లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సిబ్బంది చివరి క్షణంలో గుర్తించారు.
రన్‌వేపై విమానం గంటకు 155 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుండగా, పైలట్స్ విమానానికి బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది. ‘సోమవారం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బయల్దేరిన ఎయిరిండియా విమాన ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేశాం. కాక్‌పిట్ సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించటంతో.. టేకాఫ్‌ను ఆపాలని నిర్ణయించారు’ అని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నది.