UP CM Yogi Adityanath |ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ఈ నెల 21న చేయనున్నారని సమాచారం. హోలీ పండుగ తర్వాతే యూపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ కూడా ఇటువంటి సంకేతాలే ఇచ్చారు. ఆదివారం ఢిల్లీకి చేరుకుని ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులతో యోగి ఆదిత్యనాథ్ వరుసగా భేటీ అవుతున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో ప్రధాని నరేంద్రమోదీతో యోగి 1.46 గంటలు సమావేశం అయ్యారు. యోగి 2.0 క్యాబినెట్ రూపకల్పనపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగిందని సమాచారం. క్యాబినెట్లోకి ఎవరెవరిని తీసుకోవాలన్న అంశంపై మోదీతో భేటీలో యోగి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రధాని మోదీని యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానించారు.
యోగి 2.0 క్యాబినెట్లో ఎన్డీఏ మిత్ర పక్షాలు అప్నాదళ్, నిషాద్ పార్టీలకు చోటు కల్పనపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ప్రధానితో భేటీకి ముందు పీఎంవోలో పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తోనూ యోగి సమావేశమయ్యారు.
ఆదివారం ఢిల్లీలోని యూపీ సదన్‌కు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు.. సదన్ అధికారులు సాదర స్వాగతం పలికారు. బీఎల్ సంతోష్‌తో భేటీలో అసోం మాజీ సీఎం-కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నట్లు వినికిడి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ తర్వాత.. మిమ్మల్ని కలుసుకున్న ప్రతిసారి శక్తి వస్తుంది. మీ విలువైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు అని యోగి ట్వీట్ చేశారు.