Operation Sindoor | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : గెలుపు అంచుల్లోకి వెళ్లిన భారత్.. పాకిస్థాన్‌తో అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది. ఈ పరిణామంపై ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్, రచయిత బ్రహ్మ చెల్లానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అమెరికా ఒత్తిడితో మోదీ ప్రభుత్వం ఎందుకు కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. 26 మంది పహల్గాం బాధితులకు న్యాయం పేరిట తీసుకొచ్చిన ‘ఆపరేషన్ సిందూర్’ను మోదీ ప్రభుత్వం ఓ మూడు రోజుల విఫల కథగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొన్న ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించబోదని మండిపడ్డారు. విజయం అంచుల వరకు వెళ్లి.. ఓటమిని ఒప్పుకోవడం భారత్‌కు ఓ అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. 1948 నుంచి 2025 వరకూ ఏ చారిత్రక ఘటనను చూసినా ఇది తెలుస్తుందన్నారు. మొత్తంగా ‘ఆపరేషన్ సిందూర్’కు మోదీ ప్రభుత్వం ఓ లాజిక్‌లేని ముగింపును ఇచ్చి వ్యూహాత్మక తప్పిదం చేసిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు జాతీయ మీడియా ఇండియాటుడే, టైమ్స్‌నౌతో పాటు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో చెల్లానే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..
‘శనివారం ఉదయం పాకిస్థాన్ సైన్యం సరిహద్దు వైపు కదిలిందని వార్తలు వచ్చాయి. భారత సైన్యం కూడా పూర్తి అప్రమత్తతతో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యుద్ధం తథ్యం అనేస్థాయిలో వాతావరణం వేడెక్కింది. కానీ అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది. కాల్పుల విరమణపై వెలువడిన ఆ ప్రకటన కూడా ఇటు భారత్, అటు పాకిస్థాన్ నుంచి వచ్చిందా అంటే.. అదీ లేదు. ఈ వ్యవహారానికి సంబం ధం లేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘కాల్పుల విరమణ’పై ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత దీనిపై భారత్-పాక్ ప్రకటన చేశాయి. ఎందుకు?’ అని బ్రహ్మ చెల్లానీ ప్రశ్నించారు.
‘అమెరికా ఒత్తిడికి తలొగ్గి మోదీ ప్రభుత్వం ఈ విరమణ ప్రకటన చేసినట్టు అర్థమవుతున్నది. ఎన్డీయే సర్కారు అలా ఎందుకు చేసింది? అమెరికా ఒత్తిడికి తలొగ్గి విరమణ ప్రకటన ఎలా చేస్తారు? పహల్గాం దాడిలో 26 మంది అమాయకుల మరణాలకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ అనే గంభీరమైన పేరుతో తీసుకొచ్చిన ఈ ఆపరేషన్ కథ ఓ మూడు రోజుల విఫల కథగా మిగిలిపోయింది కదా. మోదీ ప్రభుత్వం ఎటువంటి లాజికల్ ఎండింగ్ ఇవ్వకుండా దీన్ని ముగించడం వ్యూహాత్మక తప్పిదమే’ అని బ్రహ్మ చెల్లానీ మండిపడ్డారు.
‘ప్రస్తుత పరిస్థితులు భారత్‌కు చాలా అనుకూలంగా ఉన్నాయి. పాకిస్థాన్ సైనిక శక్తి డొల్లతనం బయటపడింది. పాకిస్థాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించగా, భారత్ సమర్థవంతంగా అడ్డుకున్నది. ఇదే సమయంలో భారత సైన్యం పరిమిత సంఖ్యలో మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించి లక్ష్యాలను ఛేదించగలిగింది. దీంతో పాకిస్థాన్ వైమానిక దళం డొల్లతనం బయటపడింది. వారి సైనిక శక్తి గురించి ఇన్నాళ్లూ చేసుకొన్న ప్రచారం ఉత్తదేనని తేలింది. పాక్‌పై ఇలా స్పష్టంగా భారత సైన్యం పై చేయి సాధిస్తున్న సమయంలో కాల్పుల విరమణకు మోదీ ప్రభుత్వం ఎందుకు ఒప్పకున్నది?’ అని బ్రహ్మ చెల్లానీ ప్రశ్నించారు.
‘విజయం అంచున ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం అనేది సుదీర్ఘ భారత రాజకీయ ప్రస్థానానికి కొత్తేంకాదు. విజయం వాకిలి వరకు వెళ్లి తిరిగి రావడం మనకు ఓ అలవాటుగా మారిపోయింది. చరిత్ర నుంచి భారత్ పాఠాలు నేర్చుకోలేదు కాబట్టే.. అదే పునరావృతం అవుతున్నది. ఇవే తప్పులు జరుగుతున్నాయి. 1948లో కశ్మీర్ అంశం, 1954లో టిబెట్ వివాదం, 1960లో సింధు జలాలు, 1972లో పాకిస్థాన్ నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండానే చర్చలు ముగించడం, 2021లో ఎలాంటి బేరసారాలు చేయకుండానే వ్యూహాత్మకంగా కీలకమైన కైలాశ్ పర్వతాలను ఖాళీ చేయడం, లద్దాఖ్‌లో చైనా నిర్దేశించిన బఫర్ జోన్లకు అంగీకారం తెలుపడం.. ఇప్పుడు కాల్పుల విరమణకు ఒప్పుకోవడం.. ఇవన్నీ నిజమే కదా!’ అని బ్రహ్మ చెల్లానీ అన్నారు.
‘పాకిస్థాన్.. కాల్పులు జరిపినా, మిస్సైళ్లు ప్రయోగించినా అవేమీ పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం అసలేమీ జరుగలేదన్నట్టు కాల్పుల విరమణకు అంగీకరించింది. ఎందుకు? మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదు’ అని బ్రహ్మ చెల్లానీ అన్నారు.
“ఆపరేషన్ సిందూర్’ సమాధానాల కంటే ప్రశ్నలనే ఎక్కువగా మిగిల్చింది. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’కు బీజం వేసిన పహల్గాం దాడి గురించి గానీ, పాక్ సీమాంతర ఉగ్రవాదం గురించి గానీ ఎక్కడా చర్చకు జరుగట్లేదు. ఈ విషయానికి అసలేం సంబంధంలేని కశ్మీర్ అంశం మళ్లీ తెరమీదకు వస్తున్నది. ‘కశ్మీర్’పై మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ప్రకటించడమే దీనికి ఉదాహరణ. ట్రంప్ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి భూ ఆక్రమణ అనేది ఎంతో ఇష్టం. గ్రీన్లాండ్, పనామా కెనాల్, గాజా ఆక్రమణ అంటూ ఇలా రోజూ ఆయన ప్రకటనలను టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఆయన కశ్మీర్‌పైనా మాట్లాడారు. అయితే, భారత్ ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదాన్ని మాత్రం ట్రంప్ ప్రస్తావించలేదు. అలాంటి వ్యక్తికి తలొగ్గి మోదీ ప్రభుత్వం ఎందుకు విరమణ ప్రకటన చేసింది??’ అంటూ చెల్లానీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బ్రహ్మ చెల్లానీ ప్రఖ్యాత జియో స్ట్రాటజిస్ట్, రచయిత. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డులో ఈయన సభ్యులు. ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. భారత అణుసిద్ధాంతం ఆవిష్కర్తల్లో ఈయన కీలక పాత్ర పోషించారని 1999లో న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రశంసించింది. హార్వర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, జాన్ హాప్కిన్స్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఈయన కీలక ప్రసంగాలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ఈయన ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి.