Congress Govt | కలబుర్గి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ సలహాదారు పదవికి అలంద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ రాజీనామా చేశారు. 2023 డిసెంబర్ 29 నుంచి ఈ పదవిలో ఉన్న ఆయన తన రాజీనామాను సీఎం ఆఫీస్కు సమర్పించారు. గ్యారంటీల కారణంగా తన నియోజకవర్గానికి నిధులు రాకపోవడంతో ఈ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుటి బడ్జెట్లో ఈ ఐదు గ్యారంటీల అమలుకు 52,000 కోట్లను కేటాయించిందని చెప్పారు.
అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు నవంబర్ నాటికే బడ్జెట్లో కేటాయించిన దానికన్నా చాలా ఎక్కువ మొత్తం ఖర్చు చేశారన్నారు. నిధుల లేమి కారణంగా తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ సలహాదారు పదవి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అందుకే దానికి రాజీనామా చేసినట్టు చెప్పారు. గ్యారంటీల కారణంగా నిధులు రాక తానే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు.