న్యూఢిల్లీ: జడ్జీగా రెండు దశాబ్దాలకు పైగా అనుభవం, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా, సీజేఐగా ఆరు సంవత్సరాలు పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన రెండవ దళిత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తన తీర్పులపై ప్రశంసలతోపాటు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. బార్ అండ్ బెంచ్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
విష్ణు మూర్తి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా తనపై ఓ న్యాయవాది బూటు విసిరిన ఘటనపై అడిగిన ప్రశ్నకు జస్టిస్ గవాయ్ జవాబిస్తూ ఎవరి మనోభావాలను గాయపరిచే విధంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని విషయాలను సోషల్ మీడియా పరిస్థితి చేయి దాటే విధంగా మారుస్తుంది. మనం అనని మాటలను కూడా మనం వినేలా చేస్తుంది. అయితే నా మనస్సాక్షికి తెలుసు నేను తప్పు చేయలేదని. ఎవరి మనోభావాలను గాయపరిచేలా నేను మాట్లాడలేదు. రక్షిత కట్టడంగా ప్రకటించిన ప్రదేశాన్ని దృష్టిలో ఉంచుకుని నేను ఆ మాట అన్నాను. ఆ ప్రదేశంలో ఏ పని చేయాలన్నా సంబంధిత శాఖ అనుమతి తప్పనిసరి. నిపుణులకు సంబంధించిన విషయాలలో మేము జోక్యం చేసుకోలేము. వక్ఫ్ విషయంలో కూడా నేను అదే చెప్పాను అని జస్టిస్ గవాయ్ వివరించారు.
గవర్నర్లకు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు వివరణ ఇస్తూ ఇచ్చిన తీర్పులో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువును రాజ్యాంగం నిర్దేశించలేదని మీరు స్పష్టం చేశారు. నిరవధికంగా బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగ సంప్రదాయాలను గవర్నర్లు బాహాటంగా ధిక్కరిస్తుంంటే రాజ్యాంగ పరిరక్షకురాలిగా వాటిని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు లేదా అన్న ప్రశ్నకు జస్టిస్ గవాయ్ జవాబిస్తూ తాము స్పష్టంగా అదే చెప్పామని అన్నారు. రాజ్యాంగంలో ఎటువంటి గడువులు నిర్దేశించలేదని తాను చెప్పానని, వివరణాత్మకంగా లేని మాటలను రాజ్యాంగంలో తాము ఎలా చేర్చగలమని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో గడువు ఏదీ నిర్దేశించనప్పటికీ తగిన సమయం లోపల గవర్నర్ వ్యవహరించాలని తాము తీర్పులో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే తగిన సమయం అంటే ఒక్కో కేసుపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
కొన్ని కేసుల్లో 15 రోజులు తగిన సమయంగా సరిపోవచ్చని, అంతర్గత ఎమర్జెన్సీ లేదా విదేశీ ఎమర్జెన్సీ వంటి పరిస్థితుల్లో మూడు నెలల కాలం తగిన సమయం కావచ్చని జస్టిస్ గవాయ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిసారీ కోర్టుకు రావలసిందేనా అన్న ప్రశ్నకు అన్ని కేసులపై కోర్టే నిర్ణయం తీసుకోవాలని తాము చెప్పబోమని ఆయన అన్నారు. న్యాయ సమీక్ష హక్కును తమ పరిధిలోనే ఉంచుకుంటామని ఆయన తెలిపారు. తగిన కారణం లేకుండా ఓ బిల్లుపై గవర్నర్ ముగింపు లేకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారని కోర్టు గుర్తిస్తే ఓ నిర్దిష్ట సమయంలోగా దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను ఆదేశించే అధికారం కోర్టుకు ఎప్పుడూ ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగం ఎటువంటి నిర్దేశం చేయనప్పటికీ అరెస్టుకు కారణాలను రెండు గంటల్లోగా అందచేయాల్సి ఉంటుందని ఆర్టికల్ 22ని ఉటంకిస్తూ మీ సారథ్యంలోని మరో ధర్మాసనం ఇచ్చిన తీర్పును గురించి ప్రశ్నించగా అది ప్రజల స్వేచ్ఛకు సంబంధించిన అంశమని జస్టిస్ గవాయ్ అన్నారు. అరెస్టుకు గల కారణాలను నిందితుడికి అందచేయాల్సిన అవసరం ఉందని, దాని వల్ల నిందితుడు తన కస్టడీ అవసరం లేదని మెజిస్ట్రేట్ ముందు వాదించుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ కూడా సమతుల్యత పాటించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
అరెస్టుకు కారణాలను చెప్పకపోతే అది అక్రమ అరెస్టు అవుతుందని గతంలో చెప్పామని, అయితే పట్టపగలు అందరూ చూస్తుండగా హత్య జరిగిందనుకోండి, ఉదాహరణకు పోలీసు అధికారుల సమక్షంలోనే ఓ వ్యక్తి కాల్పులు జరిపాడనుకోండి.. మొదట కాగితం తీసుకుని అరెస్టుకు కారణాలు రాసి నిందితుడిని అరెస్టు చేయడం సాధ్యపడదు కదా అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఇవి క్షేత్రస్థాయి పరిస్థితులని, వీటిలో కొన్ని ఇబ్బందులను తాము గుర్తించామని ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో అరెస్టు చేసే సమయంలో కారణాలు చూపాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
ఇటీవల రెండు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులో జడ్జీల పేర్లు లేకపోవడం గురించి ప్రశ్నించగా అయోధ్య పద్ధతిని పాటించాలని నిర్ణయించామని జస్టిస్ గవాయ్ తెలిపారు. ధర్మాసనం ఏక కంఠంతో మాట్లాడాలని తాము భావించడంతోనే జడ్జీల పేర్లు పేర్కొనలేదన్నారు.