న్యూఢిల్లీ, మే 24 : చమురు రంగంలో అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రిటైల్ చమురు ధరల పెంపు అనివార్యమని భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) హెచ్ఆర్ డైరెక్టర్ రాజ్‌కుమార్ దూబే పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాట ధోరణిలో ఉన్న క్రమంలో విధాన నిర్ణేతల ముందు మూడు ప్రధాన ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. ఒకటి చమురు ధరలు పెంచడం అంటే పెట్రోల్ పంపుల ద్వారా ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం, రెండు పెట్రోలియం కంపెనీలు వాటి భారాన్ని మోస్తూ రోజురోజుకూ నష్టాలు భరించడం, మూడు ప్రభుత్వమే ఆ నష్టాలను భరిస్తూ లోటును పూడుస్తూ నిధులు సమకూర్చడం అని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు 20 నుంచి 50 శాతం పెరగడం తాత్కాలికంగా కన్పిస్తుందని, అయితే తిరుగుతున్న మలుపులు పరిశీలిస్తే ఇది ఇలాగే కొనసాగుతుందని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. పలుచోట్ల ఇంధన మౌలిక సదుపాయాల విధ్వంసాన్ని ఆయన ప్రస్తావిస్తూ, వాటి పునరుద్ధరణకు చాలా సమయం పడుతుందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరోసారి చమురు ధరల పెంపు ఉంటుందని తాను భావిస్తున్నట్టు దూబే తెలిపారు. మనకు చమురు ఎగుమతి చేస్తున్న దేశాలను మార్చడం ద్వారా మాత్రమే కొరత రాకుండా నివారించవచ్చునన్నారు. ఆ దేశాలు రష్యా, ఆఫ్రికా, ఇతర ఏ దేశమైనా కావచ్చునని ఆయన పేర్కొన్నారు.