లక్నో: ఒక బాలుడు 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఉరి వేసుకుని చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీశాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ దారుణం జరిగింది (Lucknow horror). గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక కాలనీలోని బాలిక ఇంట్లోకి బాలుడు చొరబడ్డాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. మృతదేహానికి ఉరి వేసి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడ దీశాడు. బాలిక తల్లి ఇంటికి రాగా ఆమెను తోసి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడు సుత్తితో కొట్టడంతో తలకు బలమైన గాయంతో బాలిక చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు బట్టలు ఇస్త్రీ చేసి జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారు షాపునకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు.
మరోవైపు నిందితుడ్ని షాహిద్‌గా పోలీసులు గుర్తించారు. పరారైన అతడి కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. హతురాలు ఆ బాలుడి మధ్య ఎదైనా సంబంధం ఉందా? ఆమెను హత్య చేయడానికి కారణం ఏమిటి అన్నది దర్యాప్తు చేస్తున్నారు. కాగా , ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.