బెంగళూరు: బెంగళూరులో ఏడో తరగతి విద్యార్థి గంధర్ (14) ఈ నెల 3న గిటార్ తీగతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపులర్ జపనీస్ వెబ్ సిరీస్ ‘డెత్ నోట్’ ప్రేరణతో గంధర్ ఈ తీవ్ర చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఈ షోను గంధర్ విపరీతంగా చూస్తూ ఉంటాడు. దీనిలోని ఓ క్యారక్టర్‌ను తన గదిలో గీశాడు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు రాత్రి అందరితో కలిసి భోజనం చేశాడు. తనకు ఎంతో ఇష్టమైన కుక్క రాకీతో కలిసి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి గదిలో నిర్జీవంగా ఉన్నాడు. గంధర్ తండ్రి మ్యూజిక్ ఆర్టిస్ట్, తల్లి సవిత జానపద గాయని. గంధర్ రాసిన సూసైడ్ నోట్లో, “అమ్మా, నాన్నా, మీరు నన్ను 14 ఏండ్ల పాటు బాగా పెంచారు. మీతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నేడు నేను వెళ్లవలసిన సమయం వచ్చింది. నేను రాసిన ఈ లేఖను మీరు చదివేసరికి, నేను స్వర్గంలో ఉంటాను” అని పేర్కొన్నాడు. ‘డెత్ నోట్’ వెబ్ సిరీస్ ప్రభావం వల్ల గంధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది.