Bethlehem | బెత్లెహాం: జీసస్ జన్మించిన బెత్లెహాంలో క్రిస్మస్ కళతప్పింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు పోటెత్తుతారు. కానీ ఈ ఏడాది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల యాత్రికులు ఇక్కడికి రాలేదు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, సావనిర్ షాపులు జనం లేక వెలవెలబోతున్నాయి. దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు అక్టోబరు 7న దాడి చేశారు. ఆ తర్వాత హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేస్తున్నది.
అదే సమయంలో ఇజ్రాయెల్ స్వాధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్‌లో హింస పెరుగుతున్నది. దీంతో బెత్లెహాంకు ఎవరూ వెళ్లడం లేదు. బెత్లెహాంలో నాలుగు తరాల నుంచి జీవిస్తున్న ఓ కుటుంబంలోని కొందరు ప్రస్తుతం ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. వీరు మాట్లాడుతూ, కనీసం ఒక గెస్ట్ అయినా రాలేదని వాపోయారు. ఇంత దయనీయ పరిస్థితుల్లో క్రిస్మస్ ఎన్నడూ జరగలేదన్నారు. క్రిస్మస్ ట్రీని పెట్టలేదని, ఆనందం లేదని, క్రిస్మస్ స్ఫూర్తి లేదని చెప్పారు.