ముంబై: ఓ కుటుంబ వంశం నిలబడటం కోసం మృతుడి వీర్యాన్ని భద్రపరచాలన్న ఓ తల్లి విజ్ఞప్తికి బాంబే హైకోర్ట్ మద్దతు పలికింది. మృతుడి వీర్యాన్ని ఘన స్థితిలో భద్రపరచాలని ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదేశించింది. ఆయన తల్లి దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగా, ఆ వీర్యాన్ని నాశనం చేస్తే, ఈ పిటిషన్ ఉద్దేశం దెబ్బతింటుందని తెలిపింది. తదుపరి విచారణ వచ్చే నెల 30న జరుగుతుంది. తన కుమారునికి క్యాన్సర్ నిర్ధారణ జరిగినపుడు, కీమోథెరపీ వల్ల సంతానోత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయని, వీర్యాన్ని ఘన స్థితిలో భద్రపరచుకోవాలని ఆంకాలజిస్ట్ సలహా ఇచ్చినట్లు పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. తనకు కీమోథెరపీ జరిగేటపుడు తన వీర్యాన్ని ముద్ద కట్టిన స్థితిలో భద్రపరచాలని తన కొడుకు వైద్యులను కోరినట్లు పిటిషనర్ తెలిపారు. అయితే, తన మరణానంతరం తన వీర్యాన్ని నాశనం చేయాలనే ఆప్షన్‌పై తన కుమారుడు టిక్ చేశారని చెప్పారు.
అంబేద్కర్ ఒకే రాజ్యాంగాన్ని కోరుకున్నారు ; ఆయన విధానాలకు ఆర్టికల్ 370 విరుద్ధం: సీజేఐ
నాగపూర్, జూన్ 28: దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఒకే రాజ్యాంగం ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నారని, రాష్ర్టానికో రాజ్యాంగం అనే ఆలోచనకు ఆయన విరుద్ధం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. నాగపూర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ..ఒకే రాజ్యాంగం పరిధిలో ఐక్య భారత్‌ను డాక్టర్ అంబేద్కర్ కల గన్నారని, దాని నుంచి సుప్రీంకోర్టు స్ఫూర్తి పొందిందని చెప్పారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నాటి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఒక సభ్యునిగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.