ముంబై : మెట్టినింట్లో కోడలిని వంట గదిలోకి అనుమతించకపోవడం మానసిక క్షోభకు గురి చేయడం కిందికే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త తనను వంట గదిలోకి రానివ్వడం లేదని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. ఇలాంటి చర్యలు మహిళల గౌరవాన్ని కించపరచడంతో పాటు మానసిక క్షోభకు గురి చేసినట్టే అవుతుందని తేల్చి చెప్పింది. 2022లో తనకు పెండ్లయిందని.. కొద్ది కాలానికే భర్తతో తనకు వివాదాలు మొదలయ్యాయని కక్షిదారు కోర్టుకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన ప్రాథమిక హక్కులకు తన అత్తింటివారు భంగం కలిగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ‘నన్ను వంట గదిలోకి అనుమతించలేదు. నా తిండిని బయట నుంచి తెచ్చుకోవాలని ఒత్తిడి చేశారు. విడాకులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు’ అని ఆమె కోర్టుకు తెలిపారు. అయితే విడాకులు ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే ఆమె ఈ ఆరోపణలు చేస్తున్నారని ప్రతివాది న్యాయవాది కోర్టులో వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మెట్టినింట్లో కోడలిని సాధారణ అవసరాలను కూడా తీర్చుకోనివ్వకుండా కట్టడి చేయడం మానసిక క్రూరత్వం కిందికే వస్తుందని చెప్పింది.