ముంబై, జూలై 3: మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న తరుణంలో బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవ్ జామ్దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను మూసివేయించుకునేందుకు పిటిషనర్ పార్టీ ఫిరాయించే విషయాన్ని పరిశీలించవచ్చని న్యాయమూర్తి చెణుకులు విసిరారు. మీరు కూడా పార్టీ మారాలి. ఎలాగూ మహారాష్ట్ర అంతటా బేరసారాలు జరుగుతున్నాయి. మీపై కొన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. పార్టీ మారే విషయాన్ని పరిశీలించండి. అక్కడ ఒక వాషింగ్ మెషీన్ ఉంది అని చమత్కరించారు.
బహిష్కరణ ఉత్తర్వుకు సంబంధించిన కేసులో ప్రభుత్వంపై హైకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు పౌరులకు లేదా అని కోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించి, నినాదాలు చేసినందుకు తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన తర్వాత ప్రభుత్వం జారీచేసిన బహిష్కరణ ఉత్తర్వును సవాలు చేస్తూ సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహీద్ చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన కేసులో హైకోర్టు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసింది.
స్థానిక రాజకీయ నాయకుడైన చౌదరిపై ఏడాదిపాటు బహిష్కరణ విధిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేస్తూ పౌరులను ప్రభుత్వానికి బానిసలుగా చేయలేమని పేర్కొంది. కేవలం తనకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్న కారణంగా ఒక వ్యక్తిని ప్రభుత్వం బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీచేయలేదని జస్టిస్ మాధవ్ జామ్దార్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వు పిటిషనర్ చౌదరి ప్రాథమిక హక్కులు, వాక్స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, గౌరవప్రదంగా జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.