Bombay High Court : కన్నతల్లిని చంపి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ‘ఫ్రై’ చేసుకుని తిన్న కసాయి కొడుకుకు కొల్హాపూర్ కోర్టు విధించిన ఉరిశిక్షను బాంబే హైకోర్టు (Bombay High Court) ఖాయం చేసింది. 2017లో జరిగిన ఈ ఘటనను ‘నరమాంస భక్షణ’ (Cannibalism) కేసుగా గుర్తిస్తూ హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన సునీల్ కుచ్కోరవి (Sunil Kuchkoravi) అనే వ్యక్తిని మార్చే అవకాశం ఎంతమాత్రం లేదని, అతనికి విధించిన ఉరిశిక్షను ఖాయం చేస్తున్నామని న్యాయమూర్తులు రేవతి మొహితె, ఫృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.
‘మేం ఈ కేసును అత్యంత అరుదైన కేసుల్లో ఒకటైన ‘నరమాంస భక్షణ’ కేసుగా పరిగణిస్తున్నాం. దోషి తన తల్లిని హత్య చేయడమే కాదు, ఆమె శరీరం నుంచి మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు లాంటి కీలక అవయవాలను వేరుచేసి వాటిని పాన్లో ఉడికించి తిన్నాడు. ఇది నరమాంస భక్షణ కిందకు వస్తుంది. ఇలాంటి ధోరణులు ఉన్నవారిని మార్చే అవకాశం లేదు. ఒకవేళ జైలు శిక్ష విధిస్తే జైలులో కూడా ఇదే తరహా నేరం చేసే అవకాశం ఉంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం.. కొల్హాపూర్ సిటీలో 2017 ఆగస్టు 28న ఈ పాశవిక హత్య జరిగింది. 63 ఏళ్ల వృద్ధురాలైన యల్లమ్మ రామ కుచ్కోరవిని అత్యంత పాశవికంగా సునీల్ హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి పాన్లో ఫ్రై చేసుకుని తిన్నాడు. మందు తాగడానికి యల్లమ్మ డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘాతుకానికి అతను పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2021లో కొల్హాపూర్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ వెంటనే ఎరవాడ జైలుకు (పుణె) అతడిని తరలించారు. తనకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని కోరుతూ సునీల్ కుచ్కోరివి హైకోర్టులో సవాల్ చేశాడు. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.