Bomb Threats | ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియాతో పాటు పలు కంపెనీలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానంలో బాంబు ఉందని చెప్పడంతో విమానాన్ని కెనడాకు మళ్లించారు. ఎక్స్ మీడియా పోస్ట్‌లో బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో భద్రతా బలగాలను సైతం అప్రమత్తమయ్యాయి. జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా విమానానికి సైతం బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఫ్లైట్‌ను అయోధ్యలో దింపి తనిఖీలు చేశారు. అలాగే స్పైస్‌జెట్‌కు చెందిన దర్భంగా-ముంబయి (SG116), ఆకాసా ఎయిర్‌లైన్‌కు చెందిన సిలిగురి-బెంగళూరు విమానానికి (QP 1373) విమానాలకు సైతం బెదిరింపులు రాగా.. సమాచారం అందుకునే సమయానికి విమానాలు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాయి.
విమానాశ్రయంలో భద్రతా సంస్థలు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇండిగోకు చెందిన డమ్మామ్ నుంచి లక్నో ఫ్లైట్ (6E 98), అలయన్స్ ఎయిర్ లైన్‌కు చెందిన అమృత్సర్, డెహ్రాడూన్ – ఢిల్లీ ఫ్లైట్ (9I 650), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మధురై-సింగపూర్ ఫ్లైట్ (IX 684)కు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా ఢిల్లీ -చికాగోకు వెళ్లే (ఏఐ127) విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో కెనడాలోని ఎకలోట్ విమానాశ్రయానికి మళ్లించారు. ప్రస్తుతం ఆ విమానంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో విమానాశ్రయాల్లోని భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. తనిఖీల అనంతరం ఆయా విమానాలు మళ్లీ బయలుదేరనున్నాయి. సోమవారం ముంబయి – న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు రాగా.. ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టులతో పాటు విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అవన్నీ బెదిరింపులు వట్టివేనని తేలింది.
అయితే, బెదిరింపులతో భద్రతా సంస్థలకు ఇబ్బందికరంగా మారింది. మరో వైపు ఎక్స్పోస్ట్లో వచ్చిన బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దమ్మామ్ నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6ఈ 98కి కూడా బాంబు బెదిరింపులు రాగా.. జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా మొదటి ప్రాధాన్యత అని ఇండిగో ప్రతినిధి తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. జైపూర్ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేకు విమానాన్ని తరలించారు. అలయన్స్ ఎయిర్‌లైన్‌కు చెందిన అమృత్సర్- డెహ్రాడూన్ -ఢిల్లీ విమానం (9ఐ 650)కి కూడా బాంబు బెదిరింపులతో.. విమానంలో అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిర్‌లైన్స్ అధికారి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మధురై-సింగపూర్ విమానం (ఐఎక్స్ 684)లో బాంబు ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మదురై-సింగపూర్ విమానం ల్యాండింగ్ కోసం సింగపూర్ అధికారుల అనుమతి కోరారు.