ముంబై, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ముంబై నగరమంతా మానవ బాంబులను మోహరించామని, వారు 400 కిలోల ఆర్డీఎక్స్తో కోటి మందిని చంపేస్తారంటూ వచ్చిన ఒక బెదిరింపు హెచ్చరిక ముంబై పోలీస్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అధికార వాట్సాప్ నంబర్‌కు గురువారం ఒక బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
తాము పాకిస్థాన్‌కు చెందిన లష్కరే జీహాదీ గ్రూప్‌నకు చెందిన వారమని, 14 మంది ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించారని, అనంత చతుర్దశి సందర్భంగా నగరంలోని 34 చోట్ల 34 మానవ బాంబులను మోహరించామని అందులో తెలిపారు. మానవ బాంబులతో కూడిన పలు వాహనాలను ముంబై నగరమంతా మోహరించామని, వారి వద్ద ఉన్న 400 కేజీల ఆర్డీఎక్స్ వల్ల కోటి మంది మరణిస్తారని మెసేజ్‌లో బెదిరించారు.
వెంటనే దీనిపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్ బ్రాంచ్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, ఇతర దర్యాప్తు సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు.