జైపూర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో బాంబు వంటి వస్తువును స్థానికులు గుర్తించారు. కిషన్‌ఘాట్ ప్రాంతంలోని నర్సరీ సమీపంలో శుక్రవారం ఉదయం దీనిని కనుగొన్నారు. (Bomb like object recovered) సర్పంచ్‌కు ఈ విషయం తెలియజేశారు. ఆయన వెంటనే పోలీసులు, ఆర్మీ అధికారులకు సమచారం ఇచ్చారు. ముందు జాగ్రత్త కోసం ఆ ప్రాంతం వద్దకు ఎవరూ వెళ్లకుండా మూసివేశారు. అనంతరం స్థానిక పోలీసులు, భారత వైమానిక దళానికి చెందిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు వంటి వస్తువును పరిశీలించారు.
కాగా, గురువారం రాత్రి జైసల్మేర్‌తో పాటు పలు ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులను పాకిస్థాన్ ప్రయోగించింది. భారత సైనిక దళాలు వీటిని కూల్చివేశాయి. ఈ నేపథ్యంలో పాక్ డ్రోన్‌కు చెందిన బాంబు భాగంగా దీనిని అనుమానిస్తున్నారు. నిర్వీర్యం చేసేందుకు బాంబు స్క్వాడ్ బృందం అక్కడకు చేరుకున్నది.
మరోవైపు పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో బ్లాక్అవుట్ అమలులో ఉన్నది. ఈ ప్రాంతంలో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, భద్రతా సూచనలను పాటించాలని అధికారులు కోరారు.