పూరి: ఒడిశాతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఒడియా ప్రజలు ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా జరుపుకునే బొయిట బందన ఉత్సవంలో అక్కడక్కడ అపశృతులు చోటుచేసుకున్నాయి. ఒడిశాలోని ధెంకనాల్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. అలిపింగల గ్రామంలోని చెరువులో ఉత్సవాలు జరుపుకుంటుండగా శక్తి సాహూ (7), సాయిరామ్ బారిక్ (10) అనే ఇద్దరు బాలురు నీట మునిగి మరణించారు.
అదే జిల్లాలోని లతబిలా సాహి గ్రామంలో బ్రాహ్మణి నది ఒడ్డున బొయిట బందన ఉత్సవం జరుపుకుంటుండగా రోషన్ నాయక్ (12) అనే బాలుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతైన రోషన్ నాయక్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పండుగపూట పిల్లలను పోగొట్టుకుని మృతుల కుటుంబీకులు విలవిల్లాడుతున్నారు.