న్యూఢిల్లీ: 242 మందితో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కుప్పకూలి పెను విషాదాన్ని మిగిల్చింది. అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన బోయింగ్ విజిల్ బ్లోయర్ జాన్ బార్నెట్‌ను ఈ ప్రమాదం మరోమారు గుర్తుకు తెచ్చింది. విమానం ఉత్పత్తి ప్రమాణాలను ఆధారాలతో సహా ప్రశ్నించిన ఆయన బోయింగ్‌పై దావా కూడా వేశారు. బార్నెట్ బోయింగ్‌లో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశారు.
నిరుడు మార్చి 9న సౌత్ కరోలినాలోని చార్లెస్టన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 62 ఏళ్ల బార్నెట్ తుపాకితో కాల్చుకుని మరణించినట్టు పోలీసులు ఆ తర్వాత నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, విజిల్ బ్లోయర్‌గా బోయింగ్‌పై దావా వేయడం, ఆ తర్వాత మృతి చెందడంతో ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మూడు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని బోయింగ్‌కు అంకితం చేసిన బార్నెట్.. నార్త్ చార్లెస్టన్ ఫెసిలిటీలో 2010 నుంచి క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో విమాన ఉత్పత్తిలో భద్రతపై పలుమార్లు ఆందోళన వ్యక్తంచేశారు. మరీ ముఖ్యంగా 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో భద్రతను ప్రశ్నిస్తూ తయారీలో లోపాలను ఎత్తిచూపారు. 2017లో ఆరోగ్య కారణాలతో రిటైరయ్యారు. అయినప్పటికీ బోయింగ్‌పై దావాను కొనసాగించారు.
2019లో ఓ ఇంటర్వ్యూలో బార్నెట్ మాట్లాడుతూ బోయింగ్ విమానాల డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో నాసిరకం పరికరాలను బిగించాలంటూ కార్మికులపై సంస్థ ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపించారు. అవన్నీ స్క్రాప్బిన్(చెత్తకుప్ప) నుంచి తెచ్చినవేనని అన్నారు. వాటిని తీసుకొచ్చి బలవంతంగా తమతో విమానానికి బిగించేలా చేశారని ఆరోపించారు.
అంతేకాదు, బోయింగ్ 787లో 25 శాతం ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టం ఫెయిలయ్యే అవకాశం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. బార్నెట్ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) 2017లో బోయింగ్ ఫెసిలిటీలో రివ్యూ చేసింది. ఈ సందర్భంగా నాణ్యతకు అనుగుణంగా లేని 53 విడిభాగాల జాడ కనిపించడం లేదని పేర్కొంది. ఈ తప్పును సరిచేసుకోవాలని బోయింగ్‌ను ఆదేశించింది.