దంతెవాడ: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముచ్నార్ ఘాట్ దగ్గర ఇంద్రావతి నదిలో ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గల్లంతయ్యారు. మరో వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ప్రమాద సమాచారం అందిన వెంటనే దంతెవాడ పోలీసులు గజ ఈతగాళ్లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ప్రమాదంలో గల్లంతైన ఏడుగురిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇంద్రావతి నదిపై వంతెన లేకపోవడంతో ముచ్నూర్ ఘాట్ దగ్గర నదికి ఇవతలి వైపున ఉన్న గ్రామస్తులు.. అవతలి వైపున ఉన్న బర్సూర్కు పడవల్లో వెళ్తుంటారు. ఈ క్రమంలో గతంలో కూడా పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఇంద్రావతి నది ప్రవాహ మట్టం పెరగడం, చిన్న పడవలో ఎనిమిది మంది ప్రయాణించడమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు చెబుతున్నారు.
కాగా, ఇంద్రావతి నదిపై ముచ్నార్ ఘాట్ దగ్గర వంతెన నిర్మించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే, నక్సలైట్ల దాడుల కారణంగా అక్కడ వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. వంతెన లేకపోవడంతో గ్రామస్తులు తమ దైనందిన అవసరాల కోసం ఇంద్రావతి నదిని పడవలో దాటి బర్సూర్ నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాల బారిన పడుతున్నారు.