న్యూఢిల్లీ: ఇప్పటికే క్విక్ కామర్స్ ద్వారా 10 నిమిషాల్లో కావాల్సిన వస్తువులను మన ఇంటి ముంగిటకు చేరుస్తున్న బ్లింకిట్ ఇప్పుడు 10 నిమిషాల్లో అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని గురువారం ప్రారంభించారు. ఇక నుంచి వినియోగదారులు తమ వినియోగ వస్తువుల కోసమే కాదు, అంబులెన్స్ కోసం కూడా బ్లింకిట్ యాప్‌ను వినియోగించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ అంబులెన్స్‌లలో ప్రాణ రక్షణ పరికరాలతోపాటు అత్యవసర మందులు, ఇంజెక్షన్లు ఉంటాయి. శిక్షణ పొందిన డ్రైవర్‌తో పాటు పారామెడిక్, డ్యూటీ అసిస్టెంట్ ఉంటారు. తొలుత ఐదు అంబులెన్స్‌లతో సర్వీసును ప్రారంభించామని, త్వరలో ఈ సర్వీసును మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని, రానున్న రెండేండ్లలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో సేవలు అందజేస్తామని సీఈవో అల్బీందర్ తెలిపారు. ఈ సౌకర్యం ద్వారా లాభాల ఆర్జన తమ లక్ష్యం కాదని, సరసమైన ధరలకు ఈ సౌకర్యాన్ని ప్రజలకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.