తిరువనంతపురం: కేంద్ర మంత్రి సురేష్ గోపి (Suresh Gopi) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భారత మాత అని కితాబిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం కరుణాకరన్, మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నాయనార్ తన రాజకీయ గురువులని అన్నారు. కేరళలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ సురేష్ గోపి బుధవారం పున్‌కున్నంలోని కరుణాకరన్ స్మారకం మురళీ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కరుణాకరన్ స్మారకం సందర్శనకు ఎలాంటి రాజకీయాలు జోడించవద్దని మీడియాను కోరారు. తన గురువుకు నివాళి అర్పించేందుకే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.
కాగా, మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నాయనార్, ఆయన భార్య శారద టీచర్ మాదిరిగా కరుణాకరన్, ఆయన భార్య కల్యాణికుట్టి అమ్మతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన సురేష్ గోపి తెలిపారు. జూన్ 12న కుటుంబ సభ్యులతో కలిసి కన్నూర్‌లోని నాయనార్ ఇంటికి కూడా ఆయన వెళ్లారు.
మరోవైపు ఇందిరా గాంధీని భారత మాతగా తాను భావిస్తానని సురేష్ గోపి చెప్పారు. అలాగే కరుణాకరన్‌ను కేరళ కాంగ్రెస్ తండ్రిగా ఆయన అభివర్ణించారు. కరుణాకరన్ ధైర్యవంతమైన పాలకుడని ప్రశంసించారు. లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసిన సురేష్ గోపీ బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. ఆయనపై బరిలో నిలిచిన కరుణాకరన్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి కే మురళీధరన్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.